top of page
GPS location.jpg

ప్రభుస్తుతి

(13 ఆగష్టు1953, డెహ్రాడూన్)

ఓ పర్వర్దిగార్! సర్వపోషకా! సర్వరక్షకా! నీవు ఆదియును, అంతమునులేని వాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరునూ ఎరుంగనేరరు.

నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు.

నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనములేని వాడవు.
నీవు అవిభాజ్యుడవు. దివ్యచక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి. నీవు ఎల్లప్పుడునున్నావు. నీవు ఎల్లప్పుడు నుందువు. నీవు అంతటను గలవు. నీవు అన్నింట నున్నావు. మరినీవు అంతటికీ, అన్నింటికీ ఆవలనుందువు.

నీవు ఆకాశమునగలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకతీతుడవు.

నీవు మూడులోకములలో ఉన్నావు, ముల్లోకములకావల గూడనున్నావు.

నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు.

నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు.

నీవు సర్వ శక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంతశక్తియు, అనంత ఆనందమును.

నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంతజ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమేనీవు. నీవు సర్వ దయాళుడవు, నిత్య శుభంకరుడవు.

నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణవిశిష్టుడవు.

నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహా సాగరుడవు.

నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు.

నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, ఆహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు.

నీవు'ఈజద్' అనబడు ఏకైక పూజ్యుడవు.

పశ్చాత్తాప ప్రార్థన

(8 నవంబర్1952, మెహెరాబాద్)

ఓం పరబ్రహ్మ పరమాత్మా! యాయజ్దాన్ ! లా ఇలాహ్ ఇల్లిల్లాహ్ ! ఓగాడ్ ఫాదర్ ఇన్ హెవెన్!
పరమ దయానిధివగు ఓఈశ్వరా!

మా పాపములన్నింటికిని మేము పశ్చాత్తాప పడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు, మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి యుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము.

స్వార్ధముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాప పడుచున్నాము.

ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్షానిందలకు మేము పశ్చాత్తాప పడుచున్నాము.

ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమొనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధకలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకునూ, మిక్కిలి పశ్చాత్తాప పడుచున్నాము.

అపార దయానిధివగు ఓఈశ్వరా!

మేము చేసిన ఈపాపములన్నింటికిని మమ్ము క్షమింప వేడుకొను చున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక, నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము.

మండలి ప్రార్థన

(మెహెర్బాబా, 25-ఆగస్టు-1959)

ప్రియతమ దైవమా!

మేము నీతో ఐక్యమగునంతటి అర్హత సంపాదించునంత వరకు, నిన్ను అధికముగా, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించునటుల మాకందరికీ సహాయము చేయుము; మరియు బాబా కొంగును చిట్టచివరి వరకూ దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరికీ సహాయము చేయుము.

bottom of page